Poorva peethika

శ్రీవిష్ణు సహస్రనామం పూర్వపీఠిక వ్యాఖ్యానంలో -  భక్తి, ధ్యానం, జపం - వీటికి ఎంతో ఉదారమైన నిర్వచనాలని పరాశర భట్టర్ వారు మనకు ఇచ్చారు. అవి ఏమిటి అనేవి చూద్దాం.

భక్తి - స్వామిని దాసస్య అనురాగమయీ స్థితిః - దాసుడికి స్వామి అంటే అనురాగం ఉండే స్థితి. ఇది ఆయన అనుగ్రహించేదే అని ప్రత్యేకం చెప్పక్కర్లేదు. 

ధ్యానం - భగవద్ గుణ అనుచిన్తనం - భగవంతుడి కల్యాణ గుణాల్ని నిరంతరం తలుచుకోవడం (ఇది ఆయన తలుచుకుంటేనే జరుగుతుంది అని నాన్ముగన్ తిరువందాదిలో తిరుమళిశై ఆళ్వార్లు బోధిస్తారు - నిరందరం నినైప్ప దాగ నీ నినైక్క వేండుమే). 

జపం - నియమ విశేషవత్ మంత్రాది ఆవర్తనం - ఏదైనా ఒక నియమం అనుసరించి మంత్రాలు మొదలైన వాటిని మళ్ళీ మళ్ళీ చెప్పడం. 

శ్రీవిష్ణు సహస్రనామం జపం ఎలా అవుతుంది అంటే - ఒకే ఈశ్వరుడి కల్యాణ గుణాల్ని మళ్ళీ మళ్ళీ తలుచుకోవడం వల్ల.

శ్రీవైష్ణవ  తెన్నాచార్య సంప్రదాయంలో అష్టాక్షరీ జపం కూడా చెయ్యడం ఉండదు. . అష్టాక్షరీ (నారాయణ) మంత్రాన్నిరోజుకి ఒకసారి ఉచ్ఛరించడమే జపం. అది ప్రతిరోజూ రిపీట్ అవడం వల్ల ఒక విధంగా జపం అవుతుంది! 

మరి జపం చెయ్యకపోతే? అంటే మంత్రార్థం తెలుసుకుని దానికి అనుగుణంగా జీవించడమే జీవితానికి పరమార్థం.  

 అనాది నిధనం విష్ణుం

భగవంతుడు అనాది నిధనుడు అంటే ఆది అంతం లేని వాడు, విష్ణువు అంటే సర్వవ్యాపి అని అర్థాలు. స్వామికి ఆది అంతాలు లేవు కాబట్టి ఆయన అనుగ్రహం అనేది కాలంపై ఆధారపడినది కాదు. అలాగే ఆయన సర్వత్రా ఉన్నాడు కాబట్టి ఆయన అనుగ్రహం దేశంపై ఆధారపడి లేదు. 

దీనిని బట్టి ఆయన ఎప్పుడు ఎక్కడ తలిస్తే అప్పుడే అక్కడే అనుగ్రహిస్తాడు అని తెలుస్తుంది. ఆయన రక్ష కోసం మనం ప్రతీక్షించడమే మనం చేయగలిగినది. 

ఇంకా ఫలానా క్షేత్రం మహిమాన్వితమైనది అనీ, ఫలానా ముహూర్తం ఉత్తమమైనది అనీ పెట్టుకోకుండా ఆయన మన మనసులో ఎపుడు  ఎక్కడ ఆవిర్భవిస్తే అదే మంచి తరుణం, అదే మంచి ప్రదేశం అని గ్రహించాలి. 


భూతానాం యో అవ్యయః పితా

--------------------------------------

సమస్త భూతాలకీ ఆయనే అవ్యయమైన తండ్రి. కాబట్టి అందరూ ఆయన నాకు ఎల్లపుడూ ఉన్నాడు అని విశ్వసించాలి. 


ఆ స్వామిని తెలుసుకోవడానికి సర్వులూ అర్హులే. దీనికి వర్ణం లింగం మొదలైన వాటితో పని లేదు అని నిర్ద్వంద్వంగా పరాశర భట్టర్ వారు తెలిపారు. మళ్ళీ తనని ఛాందసులు విమర్శించకుండా బ్రహ్మ సూత్రాల్లో అపశూద్రాధికరణాన్ని ప్రస్తావించి, అయినప్పటికీ చాలా exceptions ఉన్నాయి అంటూ, ఇలాంటి వాటిని పట్టించుకోవక్కర్లేదు అని చెప్పకనే చెప్పారు. 


శాంత్యర్థే వినియుజ్యతే 

-----------------------------

మతం పేరుతో ఏమి చేసినా చివరికి కొంచెం మనశ్శాన్తి కోసమే. ఈ విషయమే శ్రీవిష్ణు సహస్రనామంలో చెప్పబడింది. ఈ స్తోత్రాన్ని శాంతి కొరకు వినియోగిస్తారు. నిజానికి ఏది చేసినా మన తృప్తి కోసమో మనశ్శాన్తి కోసమో మాత్రమే!

భగవంతుడు నిర్గుణుడా సగుణుడా?

----------------------------------------------


యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః 


ఈ నామాలు అన్నీ ఆయన గుణాలని తెలియజెప్పేవే. కాబట్టి పరబ్రహ్మ సగుణుడు అనే విషయంలో ఏ సందేహం లేదు. 


నేనే పరబ్రహ్మని కానీ నాకు ఆ విషయం తెలియదు అనే వాదంలో పరబ్రహ్మ నిర్గుణుడు ఆంటూనే ఆయనకు అవిద్య అనే దోషం  అంటగడుతున్నారు. 


ఈ విధంగా నిర్గుణ పరబ్రహ్మ వాదాన్ని పరాశర భట్టర్ వారు ఖండించారు. వారి భాష్యంలో ఇంకా వివరంగా ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు అధ్యయనం చెయ్యవచ్చు. 



Comments

Post a Comment

Popular posts from this blog

Meanings