Meanings

 విశ్వమ్ 

---------


భగవంతుడి పూర్ణత్వానికి ప్రతీకగా ఆయనని విశ్వం అన్నారు. భగవంతుడికి సమస్త విశ్వం శరీరం. విశ్వం అన్నంత మాత్రాన ఈ విశ్వమే భగవంతుడు కాదు. ఆయనకి చెంది ఆయనకి శరీరమై ఉన్నది. 


విశ్ ధాతువుకు ప్రవేశించి ఉండటం అనేది అర్థం. అంటే ఒకప్పుడు లేడు అని కాదు!


ఈ సమస్త జగత్తులోనూ ఈశ్వరుడు అనే వాడు ఒకడు ప్రవేశించి ఉండటం వల్లే దీనికి విశ్వం అని పేరు వచ్చింది. ఈ విధంగా విశ్వం అనే పేరే నాస్తిక వాదాన్ని తిరస్కరిస్తుంది. 


విష్ణుః

--------


ఈ విధంగా సర్వమూ వ్యాపించి అన్నిట్లోనూ ప్రవేశించి ఉండటం వల్ల పరమాత్మని విష్ణువు అన్నారు.


వషట్కారః 

--------------


ఇంతకు ముందు పరమాత్మ సర్వ వ్యాపి అనీ, విశ్వరూపుడనీ సేవించుకున్నాం. 

విశ్వానికి ఆ పేరు రావడానికే కారణం ఈశ్వర సంబంధం అని కూడా చెప్పుకున్నాం. 


ఇప్పుడు వషట్కారుడు అంటే ఏమిటో చూద్దాం. 

భగవంతుడు సర్వత్ర ఉండటంలో కూడా, అది స్వతస్సిద్ధం అయినా, ఒక ప్రయోజనం ఉంది. అది సర్వాన్నీ వశపరుచుకొని ఉండటం. 

ఈవిధంగా తన స్వేచ్చతో సమస్తాన్నీ వశపరచుకుంటాడు కాబట్టి స్వామిని వషట్కారుడు అన్నారు. 


భూతభవ్యభవత్ ప్రభుః 

------------------------------


దీని అర్థం డైరెక్టుగానే ఉంటుంది. భూత భవిష్యత్ వర్తమాన కాలాలకీ ఆ కాలాల్లో ఉన్న సమస్త వస్తుజాలానికీ ఆయనే ప్రభువు. 


భూతకృత్ 

--------------


స్వతంత్రంగా సమస్త భూతాలనీ  చేసినవాడు. 


భూతభృత్

--------------- 


సమస్త భూతాలనీ భరించేవాడు. 


భావః 

---------

సమస్త భూతాలనీ వాటికి అంతర్భావంగా తన విభూతిగా కలిగినవాడు. 

భగవంతుడు ఒక నెమలి పురి లాంటి వాడు అయితే సమస్త భూతాలూ నెమలీకల వంటివి. ఎంత చక్కని వర్ణనో చూడండి పరాశర భట్టర్ వారిది. అమ్మవారి మీద శ్రీగుణ రత్న కోశం మనకు కృప చేసినవారు కదా!


భావ శబ్దానికి సత్తా లేక ఉనికి అని అర్థం. సమస్త విశ్వానికీ సత్తా శ్రీమన్నారాయణుడే అనుగ్రహిస్తున్నాడు అని భావం. ఇంకా భగవద్గీత 2.16 చూడగలరు. విస్తరణ భీతి చేత వ్రాయట్లేదు.


భూతాత్మా 

-----------

సమస్త భూతాలకూ ఆత్మ అయిన వాడు. 

మన ఆత్మలకూ ఆత్మ (అంతరాత్మ), అలాగే అచిద్వస్తువులకి కూడా ఆత్మ. ఈ విధంగా సమస్త విశ్వానికీ ఆత్మ. 


ఒక్కో సారి ఉపనిషత్తులు ఆత్మ అంటే విశ్వాత్మ గానే చెప్పాయి. ఉదాహరణకి కఠ ముండకోపనిషత్తుల్లోని "యం ఏవైష వృణుతే తేన లభ్యః" (ఎవరిని వరిస్తే పరమాత్మ వారికి లభిస్తాడు) "నాయం ఆత్మా" అని ప్రారంభం అవుతుంది. 


భూతభావనః 

-----------------


సమస్త భూతాలనీ వర్ధింపజేసే  వాడు, పాలించే వాడు.    


ఇక్కడ గీతలో అర్జునుడు భగవంతుడిని "భూతభావన! భూతేశ! దేవదేవ! జగత్పతే!" అనడం స్మరణీయం. (10.15)


పూతాత్మా 

-----------

విశ్వాత్మ ఇతర ఆత్మలకన్నా భిన్నంగా శుద్ధమైన వాడు, ఏ విధమైన కొరత (కుఱై) లేని వాడు. 

జీవాత్మలు ఈ సంసార చక్రంలో అహంకార మమకారాలతో అయన చేత ఇరికించబడతాయి. ఆయనపై ఆధారపడి ఆయన అనుగ్రహిస్తే ఆయన్ని తెలుసుకుంటాయి, లేకపోతే ఇలా ఉంటాయి. 

పరమాత్మకి ఇలాంటివి ఏమీ లేవు. తాను మాత్రం శుద్ధంగా ఉంటాడు. 

ఆయన భుజింపచేసేవాడు, మనం ఆయన సంకల్పం కారణంగా సుఖ దుఃఖాలని అనుభవిస్తున్నాం. 

ఆయన శాసించే వాడు, మనం ఆయనకి శేషభూతమైన వాళ్ళం (శిష్యులం). 

శాసించే వాడు ఒక కొరడాతో కొడితే దెబ్బ తగిలేది అనుభవించేవాడికే కదా!


పరమాత్మా 

--------------

ఆయనకి పరమైన వారు ఏమీ లేని వాడు (పరో మా అస్య). సమస్త భూతాలకీ (ఆత్మలకీ, అచేతనమైన వాటికీ) ఆత్మగా ఉండి తనకి వేరే ఆత్మ లేని వాడు. 


ముక్తానాం పరమా గతిః 

----------------------------

ముక్తదశలో కూడా తానే గతిగా ఉండే వాడు. 

ఇక్కడ  తనను తాను దేవుడిగా తెలుసుకోవడమే ముక్తి, కేవలం ఆత్మానుభవమే ముక్తి అన్న వాదాలు నిరసించబడ్డాయి. 

అలా అని పరమపదాన్ని చేరుకోవడమే జీవుడి గమ్యంగా చెపుతున్నారా? వైకుంఠ, బృహత్ నామాల్లో సమాధానం ఉంది.


అవ్యయః 

-----------

ముక్తానాం పరమాగతిః అని ఇందాక చెప్పడం వల్ల దానికి కొనసాగింపుగా అవ్యయమైన మోక్షాన్ని ఇచ్చేవాడు అని అర్థం చెప్పారు. 

ఒక సారి ఆయన చరణారవిందాల్ని చేరుకున్న తర్వాత జీవుడు ఆ స్థితి నుండి తిరిగి రాడు. 

ఇక్కడ జీవుడికి పరమప్రాప్యం ఆయన చరణారవిందాలు  అని స్పష్టంగా చెప్పారు. అంతకు మించి శ్రీవైకుంఠానికే వెళ్ళాలి అనేది మనం కోరుకోవలసినది కాదు. ఆయనంతటికి ఆయనే అనుగ్రహిస్తాడు. 

ఆయన పాదాల చెంత ఉన్నాం అన్నది మన శేషత్వాన్ని సూచిస్తుంది. 


పురుషః

----------


పురు బహు సనోతి - అనేక బహుమానాల్ని ఇచ్చేవాడు. ఇది ముక్తదశలో కూడా ఆయన అనుగ్రహమే.  


సాక్షీ 

--------


ఆనందింపజేస్తూ తాను కూడా తృప్తి చెందుతూ, బ్రహ్మానందాన్ని ఈ విధముగా సాక్షాత్కరింప చేసేవాడు సాక్షి. 


క్షేత్రజ్ఞః 

----------


ఈశ్వరానుభవాన్ని జీవులకి ఎక్కడ అనుగ్రహించాలో ఆ ప్రదేశాన్ని తెలిసిన వాడు కాబట్టి క్షేత్రజ్ఞుడు. 

తనను జీవులు అనుభవించడానికి అనువైన శరీరాన్ని కలిగినవాడు కాబట్టి క్షేత్రజ్ఞుడు (ఎలా? ఆలోచించండి!)


అక్షరః 

--------

అనుభవింపబడుతున్నప్పటికీ ఒక తేనె ఊట లాగ, మరింత మరింతగా తన కల్యాణ గుణానుభవంలో ముంచి తేల్చుతూ ఎప్పటికీ క్షరం 

కాని భగవదనుభవాన్ని ఇచ్చేవాడు. 

యోగః 

-----------

యుజ్ అనే ధాతువుకు కలిపి ఉంచడం అనే అర్థం ఉంది. 

సర్వాన్నీ తనతో కలిపి ఉంచుతాడు కాబటికి యోగః అనే నామం కలవాడు. 

ఆయనే నిజమైన యోగం. చరమ శ్లోకం ఇక్కడ స్మరణీయం. 


యోగవిదాం నేతా:

-----------------------

ఆయనతో తమ సంబంధాన్ని తెలుసుకున్నవారిని నడిపేవాడు, నయతీతి నేతా. 

ఉపాయాంతరాలు అంటే భక్తి,  ప్రపత్తి,కర్మ, జ్ఞాన, సదాచార్య సమాశ్రయణం ఇత్యాదులని స్వరూప యుక్తంగా భావించకుండా ఉపాయాలుగా భావించే వారిని కూడా తానే ఉపాయం (అదువుమ్ అవనదు ఇన్నరుళే) అని సరైన మార్గంలో నడిపే వాడు. ఎప్పటి వరకూ అంటే ఫల పర్యంతమూ, ఈ జన్మలోనే భాగవతులకు నేను శేషభూతుడిని అని తెలుసుకొని వర్తించే దాకా. 


భగవద్ గీత 10. 11, 12. 6 చూడతగ్గవి. 


ప్రధానపురుషేశ్వరః 

---------------------------


ప్రధానం అంటే మన బంధనాలకి మూల కారణం అయినది, పురుషులు అంటే జీవులు, రెండింటినీ నియమించేవాడు కాబట్టి ప్రధానపురుషేశ్వరుడు.


నారసింహ వపుః

---------------------







తన భక్తికి అంతరాయం కలగకుండా నివారించడాన్ని నరసింహ రూపంలో ప్రదర్శించాడు. భక్తి అంటే ఏమిటి అన్నది పూర్వపీఠికలో చూసాము. 

భక్తుడి భయాన్ని పోగొట్టి (తాను అన్నట్టుగా ఇక్కడ ఆవిర్భవిస్తాడా ఆవిర్భవించడా అన్న భయం) అప్పటికప్పుడే అతను కోరినవిధంగా ఆవిర్భవించినవాడు. 

తిరువాయ్ మొళి  2. 8. 9 ఇదే చెపుతున్నది. 

ఒక  ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఆళ్వారుల సిద్ధాంతాన్నే పరాశర భట్టర్ వారు భగవద్ గుణ దర్పణంలో ప్రతిపాదించారు. 

శ్రీమాన్ 

----------

ఈ విధముగా భయానకమైన నరసింహ రూపంలో వచ్చినప్పటికీ సౌందర్య లావణ్యాది కళ్యాణ గుణాలతో ప్రకాశిస్తున్నవాడు. 

కేశవః  

--------

చక్కని కేశములు కలవాడు. దివ్య ప్రబంధంలో కేశాలు జ్ఞానానికి ప్రతీక. కాబట్టి భగవంతుడి జ్ఞాన పరిపూర్ణత్వాన్ని ఈ నామం చెపుతుంది అని చెప్పవచ్చు. కేశవ నామానికి ఇంకా వేరే అర్థం ఇంకొక చోట వస్తుంది. 

పురుషోత్తమః 

----------------

పురుషులు అంటే జీవులు. వారి లాగా జ్ఞానం, ఆనందం, మొదలైన గుణాలు కలిగినవాడు అయినా, ఈశ్వరుడు వీరందరికన్నా ఉత్తమమైన వాడు. అనంతుడు. గుణపరిపూర్ణుడు. అందుచేత పురుషోత్తముడు అని పిలువ బడ్డాడు. 

పరమాత్మ జీవుల కంటే విలక్షణమైన వాడు. ఉదాహరణకి ఎలాగ అంటే ఆయన వ్యాపించి ఉంటాడు. అందరినీ భరిస్తాడు. భగవద్ గీత 7.4, 10.3, 15. 16 చూడతగినవి.

సర్వః 

--------

సర్వానికీ స్వరూప స్థితులను తన నిర్వాహంలో పెట్టుకొని శరీరానికి ఆత్మ వలె ఉండే వాడు. సర్వాంతర్యామి. 

శర్వః 

--------

స్వశరీరభూతులైన సమస్త జీవులకు అశుభాల్ని తొలగించే వాడు. 

శివః

------  

శుభావహమైన వాడు. 

స్థాణుః 

----------

స్థిరమైన వాడు, ఇతర దేవతల వలె కాకుండా, అలాగే ఇతర సాధనల వలె కాకుండా. ఇతర దేవతలు వారి శక్తి కొలది మాత్రమే అనుగ్రహిస్తారు. ఇతర సాధనలు ఆయన సంకల్పం ఉంటే (దేవతల అనుగ్రహం లాగే!) ఫలిస్తాయి, లేకపోతే ఫలించవు. భగవంతుడు ఒక సారి తన పట్ల శేషత్వ  భావాన్ని (ఆయనకే చెందినవారం అనే భావన) మనకి  ప్రసాదించాక, అది క్షీణించదు. స్థిరంగా నిలుస్తుంది.

భూతాదిః 

------------

సమస్త భూతాల చేత కోరదగిన వాడు. ఆ విధంగా జీవులందరిచేత నేతగా సంభావింప తగిన వాడు. 

నిధిరవ్యయః 

----------------

ఆపద్ధనం మాదిరి ఎంతో విలువనిచ్చి నిక్షేపించుకోదగినవాడు, అయినప్పటికీ ఎన్నటికీ తరగని వాడు. 

సంభవః 

-------------

ఈ విధంగా అవ్యయ నిధి అయిన సర్వేశ్వరుడు తన ఆశ్రితులని సంశ్లేషించడం  కోసం, అంటే వారితో పూర్తిగా కలిసిపోవడం కోసం, త్వరగా ఉద్భవిస్తాడు, ఎలాగ అంటే స్తంభంలో నరసింహుడి  లాగ. సమంతాత్ భవః అని అన్నారు, అంటే పూర్తిగా ఉద్భవించినవాడు. 

ఈయనకీ పర వాసుదేవుడికీ, సర్వాంతర్యామికీ తేడా లేదు.

పురుష సూక్తం అజాయమానో బహుధా విజాయతే అని చెపుతుంది. జన్మ లేని వాడు అనేక విధాలుగా జన్మిస్తాడు.

ఇంకా భగవద్ గీత 4.5, 4.7 చూడదగినవి. 

ఇక్కడ ఒక ముఖ్య విషయం చెప్పుకోవాలి. సాధారణంగా భగవంతుడు రాముడిగా కృష్ణుడిగా రావడాన్ని అవతారం అంటాము. ఇలా అనడం  శిష్టాచారమే.

వేదం "స వు శ్రేయాన్ భవతి జాయమానః" అంటుంది. భగవంతుడికి జన్మించడంతో శ్రేయస్సు (యశస్సు) కలుగుతుంది. 

దీనిని చక్కటి తమిళంలో తిరుమంగై ఆళ్వార్లు "తోన్ఱియ తొల్ పుగళాళా" అని పెరియ తిరుమొళిలో చెప్పారు.

అవతారం అంటే ఉన్నత స్థితి నుండి కిందకు రావడం. రామ కృష్ణాది పరిపూర్ణ అవతారాలు, సర్వేశ్వరుడి కన్నా ఏమీ తక్కువ కాదు కదా. 

అందుకే ఆళ్వార్లు భగవంతుడు  రాముడిగా కృష్ణుడిగా వచ్చినపుడు మనకి పరత్వ శంక కలుగకుండా, అవతారానికి సమాన అర్థకం వాడకుండా, ఆవిర్భావం అనే అర్థం వచ్చే రీతిలో "తోన్ఱుదల్" మాత్రమే వాడతారు.

భావనః 

---------

ఈ విధంగా ఆవిర్భవించి మన యొక్క అనిష్టనివృత్తి చేసి మనలని ఉజ్జీవింప చేస్తాడు కాబట్టి, భావనః అన్నారు. 

అనిష్ట నివృత్తి అంటే మనకు తగనివి, మన అహంకార మమకారాలు. అంతకు మించి మనకు ఇష్టం లేనివి అని కాదు!

ఉదాహరణకి రావణ సంహారం, విరోధి నిరసనానికి మంచి ప్రతీక.

పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం.. గీతా శ్లోకం స్మరించ తగినది. 

భర్తా 

------

ఈ విధంగా ఆశ్రితులకి తనను తాను సమర్పించుకొని వారి పరాయణుడై ఉండే వాడు, నిజమైన భర్త!

ప్రభవః 

---------

ప్రకృష్టమైన జన్మలని కలిగినవాడు. ఎంత ప్రకృష్టం అంటే, ఏ విధమైన దోషాలూ ఏ మాత్రమూ లేకుండా, తన సంకల్ప మాత్రాన, మనలాంటి వారిని ఈ జన్మల చక్రం నుండి తప్పించే అంత గొప్పగా సంభవించేవాడు. ఇతర దేవతల జననం, ఎప్పుడైనా అరుదుగా వారు భూలోకంలో తీసుకునే జన్మల వంటిది కాదు ఇది.

మళ్ళీ పురుష సూక్తంలో "అజాయమానో బహుధా విజాయతే" స్మరించదగ్గది (సంభవ నామంలో చూసాము).  

ఇంకా అదే పురుష సూక్తం ఉత్తర అనువాకంలో, "తస్య ధీరాః పరిజానన్తి యోనిమ్" అన్నారు. ధీరులు జగత్ కారణ తత్త్వాన్ని ఆయనదిగా బాగా తెలుసుకొంటారు. అటువంటి ధీరులకి మళ్ళీ జన్మ ఉండదు, ఆయననే పొందుతారు, అని ఆయనే భగవద్ గీత 4.9 లో చెప్పారు.

ప్రభుః

-------

విభవ అవతారాల్లో అనేక విషయాల్లో జీవుడితో సామ్యం ఉన్నా, ఆయన మాత్రం ప్రభువే. 

ఉదాహరణకి పారతంత్య్రం. 

జీవుడికి ఈశ్వర పారతంత్య్రం సహజం. 

రాముడు ఋషులకి పరతంత్రుడిగా ఉన్నాడు. వారు చెప్పినవన్నీ చేసాడు. 

ఇంక కృష్ణుడు తల్లి చేత రోటికి కట్టి వేయబడ్డాడు. 

భాగవతోత్తములకి కూడా పరతంత్రుడే. 

అయినా ఆయన ప్రభువే, ఋషులూ, యశోదాదులూ జీవులే. 


ఈశ్వరః 

---------

విభవ అవతారం అనేది  బ్రహ్మాదుల జన్మ కన్నా విలక్షణమైన పరమ ప్రయోజనం కలిగిన జన్మ కాబట్టి ఆయన ఈశ్వరుడు. ఆయన ఐశ్వర్యం (ఈశ్వర లక్షణం) కారణంగా ఆయన ఈశ్వరుడు. ఆయన శ్రేయస్సు జన్మించిన కొద్దీ వృద్ధి అవుతుంది అని ఇంతకు ముందు చెప్పుకున్నది స్మరించదగ్గది. ఇంకా భగవద్గీత 9.11, 4.6 చూడతగినవి. గీత 4.6 లో సమస్త భూతాలకీ తాను ఈశ్వరుడిని అయినా, ప్రకృతిని స్వసంకల్పం  చేత అధిష్ఠించి ఆవిర్భవిస్తాను అని స్వామి సెలవిచ్చాడు.  

అమృతః 
-------------

 అవధులు లేని మాధుర్యంతో జరామరణాలని నివారించే విధంగా సదా సేవిస్తున్నప్పటికీ తృప్తి కలగచేయని వాడు. 

భగవదనుభవంలో మునిగిన వాడు వృద్ధాప్యం గురించి మర్చిపోతాడు, మరణం గురించి అసలు చింతించడు. 

పరాశర భట్టర్ పరంపరలో అణ్ణన్ స్వామి "సౌమ్యౌ సదానుభవనేపి నవానుభావ్యౌ" అని వేంకటేశ్వరుడి శ్రీచరణాల గురించి అన్నారు. ఆయన చల్లని శ్రీపాదాలు నిరంతరం అనుభవించినా కొత్త అనుభూతిని ప్రసాదిస్తూనే ఉంటాయి. 

శాశ్వతః స్థాణుః 
-----------------------

దేవతలు తాగిన క్షీర సాగరం లోని అమృతం వలే ఒక్క సారి మాత్రమే సేవించబడేవాడు కాకుండా, శాశ్వతమైన వాడు, స్థిరమైన వాడు. తనను అనుభవించే వారి చేత అపహరించబడే వాడు కాదు. ఆయన అనుభవం శాశ్వతంగా కలిగిన వారికి అందునుంచి సంసారంలోకి తిరిగి రావడం (పునరావృత్తి) ఉండదు. 

ఇక్కడ  వరారోహః  నుంచి విష్వక్సేనః వరకూ భగవంతుడి చతుర్వ్యూహాలు అంటే వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ వ్యూహాల గురించి చెప్పబడింది. 

వాసుదేవ అన్న నామానికి అర్థం ప్రత్యేకంగా వేరే చూద్దాం. 

శ్రీభాగవతం ప్రకారం, అలాగే శ్రీపాంచరాత్ర భగవత్ శాస్త్రం ప్రకారం, భగవంతుడు నాలుగు వ్యూహాలుగా ఈ విశ్వాన్ని పరిపాలిస్తాడు. ఆ వ్యూహాలే పైన చెప్పబడిన వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ వ్యూహాలు. 

ఈ వ్యూహాల గురించి మరింత చూద్దాం.

వరారోహః 
-------------

వరమైన అంటే ఉత్కృష్టమైన ఆరోహణని అంటే తన పరమపదాన్ని జీవులకు ప్రాప్తిగా కలిగినవాడు. మిగిలినవి అన్నీ అంటే బ్రహ్మరుద్రేన్ద్రాదుల లోకాలు అంతకంటే తక్కువ స్థాయిలోనివి. 

కృష్ణుడు భగవద్గీతలో
ఆబ్రహ్మభువనాత్ లోకాః పునరావృత్తినః అర్జున!
మాముపేత్యతు కౌంతేయ! పునర్జన్మ న విద్యతే.  8.16 

అని ఈ విషయమై చెప్పాడు. బ్రహ్మాది లోకాలు పొందిన జీవులు అందరూ మళ్ళీ ఈ సంసార చక్రంలో పడవలసిన వారే. కృష్ణుడిని పొందిన వారికి మాత్రం పునర్జన్మ ఉండదు. 

మరి జయవిజయుల కథ ఎలా జరిగింది అంటే, ఆ కథ జరిగినది క్షీరాబ్దిలో. క్షీరసాగరాన్ని కూడా వైకుంఠంగానే పిలుస్తారు. 

భగవంతుడు తన లీలలను ప్రదర్శించడానికి ఏర్పరిచిన వ్యూహాలే వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ వ్యూహాలు. 

ఇందులో వాసుదేవత్వం భగవంతుడి సర్వవ్యాపకత్వాన్ని తెలియజేస్తుంది. 

విష్ణు సహస్రనామంలోనే ఉత్తరపీఠికలో వ్యాసుల వారు వాసుదేవ అన్న నామానికి నిర్వచనం ఇలా ఇచ్చారు:

వాసనాద్ వాసుదేవస్య వాసితమ్ తే జగత్త్రయమ్| 
సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తు తే| 

మూడు లోకాలూ (సమస్తలోకాలూ), వాసుదేవుడి చేత ఆవరించబడి ఉన్నాయి. సర్వభూతాలకూ నివాసమైన వాసుదేవుడికి నమస్కారం. 

వాసుదేవుడు సర్వలోకాలకీ ప్రభువు అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాబట్టి ఆ వాసుదేవుడిని పొందటమే అన్నిటికన్నా ఉత్కృష్టమైన ఆరోహణం. 

ఈ విషయమై పరాశర భట్టార్యులు శ్రీపాంచరాత్ర భగవత్ శాస్త్ర (ఆగమ) సంహితల నుండి విస్తారంగా ఉదాహరణలు ఇచ్చారు. 

భగవంతుడి గుణాలని ప్రధానంగా ఆరుగా మనకి తెలిసినంతలో వర్గీకరించవచ్చు. అవి, జ్ఞానం, బలం, ఐశ్వర్యం, వీర్యం, తేజస్సు, శక్తి,. 

ఈ ఆరు గుణాలూ పరిపూర్ణంగా ఉన్నవాడు భగవంతుడు. అందుకే ఆయనని షాడ్గుణ్య పరిపూర్ణుడు అంటారు. ఆయనే వాసుదేవుడు. ఈ వాసుదేవ వ్యూహం, మిగిలిన మూడు వ్యూహాలకూ, అంటే, సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ వ్యూహాలకు మూలం అయినది. 

వరారోహః అన్న ఈ నామం భగవంతుడి వాసుదేవ వ్యూహాన్ని తెలియజేస్తోంది. 

మహాతపాః
---------------

మహత్ అంటే పూజ్యమైన, తపస్సు అంటే జ్ఞానాన్ని, కలిగినవాడు మహాతపాః అని పిలువబడుతున్నాడు. 

ఇది పరమాత్మ సంకర్షణ వ్యూహాన్ని సూచిస్తుంది. 

ఇక్కడ పరాశర భట్టార్యులు జ్ఞానం అంటే, ప్రాచీనభవ పరిశ్రాంతి శాంతయే సంజిహీర్షా లక్షణం అని ఇచ్చారు. 

జిహీర్ష అంటే తనకు సంతృప్తి కలగాలి అనే ఆకాంక్ష. . 

అంటే, ప్రాచీన భవబంధాల నుంచి కష్టపడుతున్న జీవులకు శాంతిని ప్రసాదించే భగవత్ సంకల్పమే జ్ఞానం అని అర్థం. 
ఎలాగ అంటే, మేము భగవంతుడి వారిమి అనే శేషత్వజ్ఞానం జీవుడికి కలిగినప్పుడే జీవుడి భవబంధాలు వైదొలగి, అతను శాశ్వతమైన శాంతిని పొందుతాడు. ఆ జ్ఞానం ఇప్పటికైనా జీవుడిలో జ్ఞానస్వరూపుడైన పరమాత్మ ఆవిష్కరించడమే ఈ నామంలో చెప్పబడింది. 

పరమాత్మ భగవద్గీత 4. 14 లో ఇలా అంటాడు:

న మామ్ కర్మాణి లిమ్పన్తి 
న మే  కర్మఫల స్పృహా 
ఉదాసీనవదాసీన-
మసక్తం తేషు కర్మసు. 

నన్ను కర్మలు అంటవు, కర్మఫలం ఏమి అవుతుంది అనే స్పృహ నాకు ఉండదు, ఉదాసీనంగా నేను వాటితో ఏ విధమైన బంధాన్నీ కలిగి ఉండను - అని అర్థం. 

మరి ఎందుకు పరమాత్మ ఈ ప్రపంచాన్ని అంతటినీ నిర్వహిస్తాడు అంటే, జీవుల యోగక్షేమాల కోసమే తప్ప తనకోసం కాదు. 

అలాంటి పరమాత్మ, ఇప్పటికైనా ఈ జీవుడికి భవబంధాల నుంచి ముక్తిని ప్రసాదించి అతనికి శేషత్వ జ్ఞానాన్ని అనుగ్రహించాను అని సంతోషించడమే ఇక్కడ భట్టర్ వారు సూచిస్తున్న జిహీర్ష.

సంకర్షణుడు అంటే మనలో భక్తిని కర్షణం చేసేవాడు లేదా పండించేవాడు. భక్తి అంటే మేము భగవంతుడికే చెందినవారము అనే శేషత్వబుద్ధి. అలా వాసుదేవుడి సంకర్షణత్వానికి ఈ నామం చక్కగా సరిపోయింది.

సర్వగః 
-----------

అందరి వద్దకూ చేరుకునే వాడు. 

కర్షణం అంటే వ్యవసాయం అనీ, తనవైపుకు ఆకర్షించడం అనీ అర్థాలు ఉన్నాయి. 

సృష్టికి పూర్వం పరమాత్మ సంహరించబడ్డ జీవులని అందరినీ తనలోపలికి తీసుకుని అందరినీ ధరించి ఉంటాడు. ఎలా అంటే ఈ శరీరం జీవించి ఉండటానికి ఆత్మ ఆధారం అయినట్టుగా, జీవులందరినీ అంతరాత్మగా ధరించి ఉంటాడు.  ఈ విధమైన ధారణా సామర్థ్యమే బలం. 

పరమాత్మ ఇలా జీవులందరినీ ఆకర్షించి తద్వారా చేరువై ఉంటాడు కాబట్టి ఈ నామం కూడా ఆయన సంకర్షణ వ్యూహాన్ని సూచిస్తుంది. 

సర్వవిత్ 
-------------

అందరినీ పొంది ఉన్న వాడు. 

పరమాత్మ సంహరించబడ్డ జీవులని అందరినీ సృష్టి ద్వారా మళ్లీ పొందుతాడు. అంటే ఈ మధ్యలో జీవులు తనకి చెందరు అని కాదు. సృష్టి ద్వారా తన లీలలని పునః ప్రారంభిస్తాడు. 

ఈ విధంగా జగత్తుని నిర్మించే శక్తి, ఆ శక్తి ద్వారా జీవులని అందరినీ పొందిన ఐశ్వర్యం,  ఈ గుణాలని ఈ నామం సూచిస్తుంది. 

పరమాత్మ యొక్క  ప్రద్యుమ్న వ్యూహాన్ని ఈ నామం చెపుతోంది. జీవులని అందరినీ సృష్టి ద్వారా ప్రకాశింప చేసే వాడు కాబట్టి ప్రద్యుమ్నుడు. 

భానుః 
---------

ఈ విధంగా సర్వాన్నీనిర్మించినప్పటికీ తాను మాత్రం ఏ వికృతినీ అంటే మార్పుని పొందకుండా ప్రకాశించేవాడు. 

ఇది భగవంతుడి తేజస్సుని సూచిస్తుంది.

విష్వక్సేనః 
---------------

ఇనుడు అంటే ప్రభువు. ఆయనతో పాటు ఉండేది సేన, అని నిరుక్తకారుడు అయిన యాస్కుడు అంటాడు. విశ్వంలోని జీవులన్నిటినీ రక్షించే సైన్యం కలవాడు కాబట్టి విష్వక్సేనుడు. 

ఇది ఆయన స్థాపకత్వం లేదా స్థితికర్తృత్వాన్ని సూచిస్తుంది. ఈ నామం అనిరుద్ధ వ్యూహానికి సంబంధించినది. 

లోకరక్షణంలో నిరోధించబడలేని వాడు కాబట్టి అనిరుద్ధుడు అని పేరు వచ్చింది. 

ఈ నామం కూడా భగవంతుడి అపరిమిత శక్తిని సూచిస్తుంది. 

జనార్దనః 
-------------

తన జగద్రక్షణలో అడ్డువచ్చే జనులను అంటే రాక్షసులని  ఏ విధమైన సహాయమూ లేకుండా  నిగ్రహించేవాడు కాబట్టి జనార్ధనుడు అయ్యాడు. ఈ నామం కూడా భగవంతుడి అనిరుద్ధ వ్యూహాన్ని సూచిస్తుంది. ఈ నామంలో తెలియబడే గుణం వీర్యం.

వేదః 
-------

గతంలో మహాతపా అన్న చోట చెప్పుకున్నట్టుగా గొప్పదైన జ్ఞానాన్ని కలిగినవాడు సంకర్షణుడు. 

ఇక్కడ అలాంటి గొప్పదైన జ్ఞానాన్ని ఇచ్చేవాడిగా చెప్పబడ్డాడు. 

శాసనాత్ త్రాయతే ఇతి శాస్త్రం - ఆయన తన శాసనంగా  మనల్ని రక్షించేదే శాస్త్రం.

వేదం అంటే జ్ఞానం. సృష్టి చెయ్యడానికి బ్రహ్మకి ఉపయోగపడిన జ్ఞానమే వేదం. 

ఆ జ్ఞానం ఎవరి యందు లభిస్తుందో ఆయననే ఈ నామంలో వేదః అన్నారు. 

కర్షణం అంటే కృషి అనీ, భగవంతుడు మనలో భక్తిని లేదా శేషత్వబుద్ధిని పండిస్తాడు అనీ చెప్పుకున్నాం. 

అది ఇక్కడ కూడా సరిపోతుంది. 

వేదాలను మొదట ఉపదేశించినవాడు ఆయనే అని వేదమే చెప్పి ఉంది (యో వై వేదాంశ్చ ప్రణిహోతి తస్మై -శ్వేతాశ్వతర ఉపనిషత్ - 6. 18)

ఇంకా  గొప్పదైన ఉపాయం, ఆగమం, నేత (నడిపించే వాడు), బ్రాహ్మణుడు, ఆచార్యుడు, మార్గములు, అన్నీ ఆ సంకర్షణుడిని సూచించే నామాలే అని పరాశర భట్టర్ ఈ నామానికి వ్యాఖ్యానంలో తెలియచెపుతున్నారు.

వేదవిత్ 
------------

వేదాలను పూర్తిగా నిస్సంశయంగా ఏ విధమైన కొరతా లేకుండా  తెలిసినవాడు శ్రీమన్నారాయణుడు. 

జ్ఞాన పరిపూర్ణుడు అని అర్థం. 

వేదాన్తకృత్ వేదవిదేవ చాహమ్ - అని భగవద్గీత 15.15.

అవ్యంగః 
-----------

పరమాత్మ కేవలం వేదస్వరూపుడు మాత్రమే అయినవాడు కాదు. తానే కల్పించిన ఆరు వేదాంగాలను కూడా కలిగిన వాడు. వేదాంగములు లేని వాడు కాదు. 

శిక్ష, క ల్పం,వ్యాకరణం, నిరుక్తం,  ఛందస్సు, జ్యోతిషం - ఇవి వేదాంగాలు. 

వేదాంగః 
-----------
అనంతములైన శాఖలను కలిగిన వేదాలని తన శరీరంగా కలిగినవాడు, అంటే జ్ఞానమయుడు పరమాత్మ. 

వేదవిత్ 
-----------

పరమాత్మ వేదాల చేత తెలుసుకోదగినవాడు, వేద స్వరూపుడు.  అలాంటి ఆయన వేదములలోని ధర్మాన్ని అనుష్ఠింపజేయడం  ద్వారా జీవుడిని పొందే వాడు-  ప్రద్యుమ్నుడు.  అంటే తనను తాను వేదాల ద్వారా ప్రకాశింపచేసుకునేవాడు. వేదాలను ప్రవర్తింపచేసేవాడు. ద్యుతి అంటే ప్రకాశం అని అర్థం. 

ఇక్కడ వింద్ అంటే పొందటం అనే ధాతువు ఉపయోగించబడింది. 

వేదాన్తకృత్ వేదవిత్ ఏవ చాహం- భగవద్ గీత 15.15 

కవి: 
-----

క్రాన్తదర్శిత్వాత్ కవి: సమస్త ప్రపంచాన్నీ అన్ని చోట్లా అన్ని కాలాల్లోనూ దర్శించగలిగే వాడు కాబట్టి కవి అన్నారు. 

మామూలుగా కవులని వారి ఊహాసామర్థ్యం కారణంగా క్రాంతదర్శులు అంటారు. 

రాముడు అందమైనవాడు అన్నపుడు పరమాత్మ అందమైనవాడు అని అర్థం. ఫలానా వ్యక్తి  అందమైన వాడు అన్నపుడు అది  ఆ వ్యక్తికి మాత్రమే తాత్కాలికంగా చెందుతుంది. 

ఒక దీపం వెలగడానికీ సూర్యుడి ప్రకాశానికీ తేడా ఉన్నట్టే, మానవులలో మంచి పద్యాలు రాసేవారిని కవులు అనడానికీ, భగవంతుడిని కవి అనడానికీ చాలా తేడా ఉంది.




Comments

Popular posts from this blog

Poorva peethika